ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి తన కుమారునకు ఎన్నో కథలు చెప్పింది. వాటి ద్వారా శివాజీ దేశభక్తిని పెంపొందించుకొని, తమ ప్రాంతాన్ని పరాయి పాలన నుండి కాపాడి, ప్రజలను బంధ విముక్తులను చేసి దేశాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు.
కథలు పిల్లలకు వివేకాన్ని, విజ్ఞానాన్ని ఆచరణాత్మక ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఎంతో మంది వ్యక్తులను చూస్తుంటాము. బయటికి కనపడేది వారి బాహ్య సౌందర్యం. కానీ వారి పరిచయాలతో మనకు మరొక్కటి కూడా కనపడతుంది. అది వారి అంతర్గత సౌందర్యం. ఆరెంటి నడవడిక శీలమని అంటాము. రెండవది బయటకు కనపడదు. మనస్సుతో, బుద్ధితో మాత్రమే చూడగలము. ఆ వ్యక్తులను దగ్గరిగా గమనిస్తేనే వారి అంతర ప్రవర్తన బయట పడుతుంది. అప్పుడు తెలుస్తుంది వారి అసలు స్వరూపం, వారు మంచివారా? నమ్మదగిన వారా ? కాదా అని. కొందరు మాటలతో మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాళ్లు బయటికి చెప్పేది ఒకటి చేసేది మరొకటి. అట్లాంటి వారు మాటలతో బోల్తా కొట్టిస్తారు. అందుకే అట్టి వారి విషయంలో జాగ్రత్త పడాలని కథలు సూచిస్తాయి.
కొందరు సామాజిక స్పృహతో పరోపకారమే ధ్యేయంగా ఉంటారు. వారిలో ఔదార్యం త్యాగం, ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు, కరుణ, దయాది ఉత్తమ భావాలుంటాయి. వారి మనస్సు మానవ కళ్యాణాన్ని కోరుకుంటుంది. మరి కొందరు అవినీతి, అన్యాయం, దౌర్జన్యం, పరపీడన, అసూయ వంటి హీనభావాలతో తలమునకలై సంపాదనే ధ్యేయంగా ఈర్ష్యా ద్వేషాలే అన్నపానీయాలుగా, హింసా ప్రవృత్తియే జీవిత గమ్యంగా స్వార్థంలో స్నానమాడి పుట్టలో పామై ముడుచుకొని ఉంటారు. అట్టి వారి నుండి జాగ్రత్త పడాలని పిల్లలకు కథలు చెప్తాయి.
పుట్టినపుడు బాలల మనస్సు ఏ వంకరటింకర గీతలు లేని స్వచ్ఛమైన తెల్లకాగితం వలె నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. వారి మస్తకమస్తిష్కాల్లో కుల, మత, జాతి భేదాల్లేని సర్వ మానవ సౌభ్రాతృత్వ భావజాలాన్ని, ముద్రిస్తే పిల్లలు అలాంటి భావజాలంతో పెరిగి దేశ సౌభాగ్య, సంక్షేమాలకు పాటుపడతారు. నవభారత సమాజ పునాదుల పై కొత్త నిర్మాణాలు సాగుతాయి. పెరిగే పిల్లలే దేశం, వారిపైనే దేశం ఆధారపడి ఉంది. కానీ నేడు గమనిస్తే ఎవర్నీ ఏమి అనలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ, నోరెత్తి ధైర్యంగా మాట్లాడగల స్థితిని ఏనాడో కోల్పోయాం. నీతులు అటకెక్కాయి. దయాదాక్షిణ్యాలు అడుగంటాయి. వీటన్నింటికి కారణం మనుషుల్లో నైతిక విలువలు దారి తప్పడమే. ప్రధానంగా పిల్లల మనస్తత్వంలో ముఖ్యమైన గుణం తెలుసుకోవాలన్న కుతూహలం. దాన్ని ఆసరాగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం పిల్లలు ఎదిగే వయస్సుల్లో కరుణ, స్నేహం, సౌందర్య పిపాస వంటి సున్నిత మనోభావాలను మనస్సుల్లో కుసుమకోమలంగా ప్రభావితం చేయగలిగితే ఆ ఉన్నత భావాలు వారిలో తల్లిపాలులా జీర్ణమై, వారు మానవత్వ మనుగడకు, దేశ సంక్షేమానికి, పురోగతికి పాటుపడతారు. ఆ విలువలను ప్రోది చేసి నీరు పోసి పెంచే ప్రయత్నమే ఇది. విత్తనం నాటి నీరు పోసి రక్షించి, పెంచి పెద్ద చేయనిది మొక్క వృక్షంగా మారదు. ఫలాలనివ్వదు. పిల్లలూ అంతే.
నా ఆశయ విత్తనానికి ఉపాధ్యాయులు, విద్యావంతులు, అవ్వ, తాతలు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. అప్పుడే ఉత్తమ విలువలు, ఫలప్రదమౌతాయి. ఆ వందలు, వేలు, లక్షల కథలు పుస్తకాలల్లో మధుర రసాలనూరిస్తూ కాచుకొని వేచిఉన్నాయి. పెద్దలు వాటినందుకొని చవిచూడాలి. తర్వాత పిల్లలకు ఆ తీపి రుచి చూపించాలి. చీకటి గదిలో చిన్న దీపం వెలిగిస్తే ఆ దీప కాంతులు దానిచుట్టే గీత గీసుకొని ఉండకుండా, గది అంతటా ఎట్లా వ్యాపించి వెలుగునిస్తాయో, అట్లే కథల్లోని నైతిక విలువలు పిల్లల మనస్సుల్లో నిండి వెలుగులు నింపుతాయి. అప్పుడే రాబోవు తరాలు స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖశాంతులతో వర్ధిల్ల గలుగుతారు. అందుకే బాలల్లో నైతిక విలువలు పెంపొందించబడాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించబడుతుంది.
ఈ కథలను పెద్దలు చదువుకొని, పిల్లలకు చెబితే కథలకు ప్రాణం పోసినట్లవుతుంది.
బాలలంటే 16 సంవత్సరముల వయస్సులోపు వారని నిఘంటువుల్లో ఉంది. నేను బాలలను మూడు వర్గాలుగా విభజించుకున్నాను. మొదటి వర్గం 1 నుండి 8 సంవత్సరాల లోపు, రెండవ వర్గం 9 నుండి 12, సంవత్సరాల లోపు మూడవ వర్గం 13 నుండి 16 సంవత్సరాల వరకు. మొదటి వర్గానికి బాలగేయాలు, ఆట పాటలు నేర్పించాలి. రెండు, మూడు వర్గాలకు ఆటలతో పాటు కథల ద్వారా మానసిక వికాసాన్ని కలిగించే నైతిక విలువలు గల కథలను చెప్పాలి. చదివించాలి. చదువుకోవడానికి పిల్లలకు అవకాశం కల్పించాలి.
చొప్ప వీరభద్రప్ప