Musthadu: A Radiant Armor

· SHEELAM BHADRAIAH
E-knjiga
120
Stranica
Ocene i recenzije nisu verifikovane  Saznajte više

O ovoj e-knjizi

గౌడ వృత్తి ప్రజల ఆత్మగీతం

First Indian gouda poetry

బతుకమ్మ పండుగ చుట్టూ తెలంగాణ సంస్కృతి అల్లుకున్నట్లు, గౌడ వృత్తి చుట్టూ మానవ జీవితం ఎంతో పెనవేసుకొని ఉంది. గౌండ్ల మామ తెచ్చే ‘నీర’, ముంజలు, తాటిపండ్లు, ఈత పండ్లు, తాటి బెల్లం, గేగులు, తాతకు ‘వాడిక’, తాళపత్రాలు, గుడిసెకు కప్పే తాటి కమ్మలు, తాటి మొద్దులు, తాటి దొప్పలు, తాటాకుల విసనకర్ర, పిల్లలాడుకునే తాటికమ్మల గాలి గిరకలు, తాటి పండ్లతో చేసే గీరెల బండి, తాటిమట్టల ఆటలు, తాటి చాపలు, ఈత చాపలు, బుట్టలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు మొదలైనవి మనిషి బతుకును మరింత రుచికరం, ఆనందకరం, సుఖవంతం చేస్తున్నాయి. ‘కల్లుకు వచ్చి ముంత దాచినట్లు’, ‘తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నామంటే నమ్ముతామా!’, ‘తాటి చెట్టు కింద పాలు అమ్మినట్లు’, ‘కల్లు తాగిన కోతి నిప్పు తొక్కిన నక్క’, ‘కల్లులో నీళ్ళు కలిపినట్లు’, ‘ఈత కాయంత పని తాటికాయంత ఆశ’, ‘కల్లుతాగి కయ్యానికి దిగినట్లు’ లాంటి గౌడ వృత్తికి సంబంధించిన ఎన్నో సామెతలు, పాటలు, కథలు, నవలలు ఉండనే ఉన్నాయి. తెలుగులో గీతకార్మిక వృత్తి ఆధారంగా బోలెడు కవిత్వం కూడా వచ్చింది. గౌడ వృత్తి చుట్టూ పరుచుకున్న మానవ సంస్కృతిని అనేక కోణాల్లో గొంతులోకి కల్లును ఒంపుకున్నంత సహజంగా కవిత్వంలోకి ఒంపిన తొలి గౌడ కవితా సంపుటి శీలం భద్రయ్య ఇటీవల వెలువరించిన ‘ముస్తాదు’ (A Radiant Armor).

​దేశంలో కులగణన జరుగుతున్న సందర్భంలో శీలం భద్రయ్య వెలువరించిన ఈ ‘ముస్తాదు’ తెలుగు సాహిత్యంలో చిన్న కదలికను తెచ్చిందని చెప్పాలి. ఆయా కులాల అస్తిత్వం, ఆయా కులాల ఉత్పత్తులు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోన్న తీరు, సంస్కృతిని ప్రభావితం చేస్తోన్న పధ్ధతి, జీవన విధానం అంతా చర్చకు పెట్టాల్సిన సందర్భం ఇది. విశ్రాంతి వర్గాలకు, దోపిడీ వర్గాలకు, ఉత్పత్తి కులాలకు, బహుజన వర్గాలకు మధ్యగల అంతరాలను, జీవన వ్యత్యాసాలను దరువు వేసి చెప్పాల్సిన కాలం ఇది. తెలుగు నేల మీద అస్తిత్వ ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఈ ‘ముస్తాదు’ నిజంగానే బహుజన వర్గాలకు తేజోవంతమైన కవచం.

​గీతకార్మిక కళ, ఆత్మగౌరవం, గౌడ వృత్తి తాత్త్వికత, పోద్దాడు, పరుపుతాడు కల్లు అందించే ఆనంద, ఆరోగ్యాలు, ఆర్థికంగా ఆదుకునే తీరు, కల్లు మండువా సామ్యవాద దృక్పథం, గౌడ వృత్తి పట్ల ప్రజల చూపు, పనిముట్ల వెనక దాగిన కవితా దృష్టి, వృత్తిలోని శ్రమజీవన సౌందర్యం, కష్ట, నష్టాలు, దుఃఖo, బీరు సీసాకు, కల్లు బింకికి మధ్యగల తారతమ్యం, లొట్టి దొంగల వైనం, గౌడకుల తేజోమూర్తులు, గౌడ వృత్తికి ఆధునికంగా ఎదురవుతున్న సంక్షోభం, కుల ఓటు బ్యాంకు, ఇలా గౌడ వృత్తి కేంద్రంగా మూడు వందల అరవై కోణాల్లో సృజించిన మినీకవిత్వం ఈ ‘ముస్తాదు’ లో తొంగిచూస్తుంది.

​ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడం అస్తిత్వ ఉద్యమాల ప్రాథమిక లక్షణం. అందుకే ఈ కవి “కల్లు మా కుల దేవత/మండువా మా భరతమాత/తాటి చెట్టు మా జాతి పతాక/సర్వాయి మా జాతిపిత” అని సగర్వంగా చాటుతున్నాడు. పోకిరీ జనాలు కొంత మంది గీత వృత్తిని చులకనగా చూస్తుంటారు. “కల్లుందా? పిల్లుందా? అని అడగకండి/మండువాలో... అమ్మా చెల్లి ఉంది” అని వృత్తికి కుటుంబ మద్దతు ఎంత అవసరమో చెప్తున్నాడు. కల్లు విక్రయంలో సహకరించే మహిళలను ఎలా చూడాలో కూడా చెప్తాడు.  

“మెరబెడుతూ బెడుతూ

జీవితం అరిగిపోయింది

కల్లు ఊటలా కండ్లల్ల చెమ్మ”

ఎన్ని కుండల కల్లు అమ్మినా పొయ్యి మీదికి కుండ ఎక్కని సంసారాలు ఎన్నో. కాళ్ళు, చేతులు, దేహమంతా కాయలు కాచేలా కష్టపడినా చివరికి మిగిలేది ఖాళీ పటువనే. కంట్లో కన్నీటి పోరనే.

“తాటి వనాలు గొప్ప తత్త్వకేంద్రాలు

మనో చికిత్సాలయాలు

ఆనంద నిలయాలు

ఆధునిక దేవాలయాలు”

మనిషి తత్త్వం, మనసు గాయం బయటపడేది తాటివనాల్లోనే. పుండుకు మందు కూడా మండువాలోనే దొరుకుతుంది. కబుర్లు చెప్పుకుంటూ కల్లు వంపడం వల్ల సామాజిక బంధాలు బలపడుతాయి. ఎల్లమ్మ తల్లి కొలువుండే తాటివనాలను కవి ‘ఆధునిక దేవాలయాలు’ అన్నాడు. తాటి చెట్లు ప్రశాంతతను, ఉపాధిని, జీవనాధారాన్ని కల్పించేవి కూడా కావడం గమనార్హం.

“మండువా మా గుడి

మండువా మా మసీదు

మండువా మా చర్చి

ఇక్కడ అందరూ మేమే”

లోకంలో ఏ చోటుకు పోయినా ధనిక, పేద, కుల, మతాంతరాలు లేని స్థలం దొరకదు. మండువాలో మాత్రం సామ్యవాదం వర్ధిల్లుతుంది. మండువా కేవలం కల్లు విక్రయ కేంద్రమే కాదు, అది గౌడుల సామాజిక, ఆర్ధిక, మానసిక కేంద్రం. కుల, మత, వర్గ భేదాలు లేనిది మండువా. చివరి వాక్యం సామాజిక ఐక్యతకు, సమత్వానికి, బహుముఖ పాత్రకు సూచిక.

“గుత్తాధిపత్యం

భూమి నీదే, చెట్టు నీదే

నాది ఉత్తాధిపత్యం

ఆకు కూడా నాది కాదు”

తరతరాలుగా గౌడ వృత్తిలో ఉన్నప్పటికీ ఏ గీత కార్మికునికి తాటి చెట్టు మీద అధికారం లేదు. చెట్లను గుత్తకు తీసుకున్న కాంట్రాక్టర్లు, లైసెన్స్ దారులు వేరే ఉంటారు. గీతకార్మికులు కేవలం ‘రకం’ (పన్ను) కట్టి తాళ్ళు గీసుకోవాలి. అంతేకాని ఎలాంటి నియంత్రణ వారికి ఉండదు. తన జీవిత కాలంలో ఏ గౌడూ ఒక్క తాటి చెట్టును కూడా సొంతం చేసుకోలేడు. దళారుల నుండి కేవలం అనుమతి తీసుకొని కల్లు అమ్ముకోవడం వరకే అతని పని. పేరుకు మాత్రమే అతడు గౌడు. తాటి చెట్ల మీద ఎలాంటి అధికారం లేదు. కల్లు గీయడం, విక్రయించడం, పన్ను కట్టడం ఇంతే అతని పని. వృత్తిపరమైన బలహీనతకు ఇదొక ఉదాహరణ.

​“నడుముకు కట్టిన ముస్తాదు గోసను  

​​నడిజాముదాకా విన్న తాటి చెట్టు

​​తెల్లరిందాకా కన్నీరు పెట్టింది”

‘ముస్తాదు’ గీతకార్మికుని కుటుంబ శ్రమకు, వాళ్ళు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులకు, సామాజిక వివక్షకు, అభద్రతకు ప్రతీక. గౌడు గుండెలో పేరుకుపోయిన సమస్త దుఃఖానికి, బాధకు, బతుకుదెరువుకు ‘ముస్తాదు’ నిలువెత్తు నిదర్శనం. తాటి చెట్టు గీతకార్మికుని కష్టానికి ప్రత్యక్ష సాక్షి. అతని ఒంటరి తనానికి ఒక తోడు.

​‘ముస్తాదు’లో సామాజిక దృక్పథంతో పాటు కవిత్వ దినుసు కూడా ఎక్కువే ఉంది. కవితా, శైలీ శిల్పాలు, కవి వాడిన ప్రత్యేక జార్గాను, భావచిత్రాలు, ప్రతీకలు కొత్తచూపును ప్రసాదిస్తాయి.

“కల్లు తాగిన వెన్నెల

నవ్వితే

చీకటి కూడా చిన్నబోయింది”

అంటాడు. ఇక్కడ ప్రాణం లేని వెన్నెలను "కల్లు తాగింది" అని, అది "నవ్వింది" అని, చీకటి "చిన్నబోయింది" అని మానవ లక్షణాలను (Personification) ఆపాదించిన తీరు అమోఘం. వెన్నెలకు మత్తును ఆపాదించడం ద్వారా ఒక వినూత్న భావనను సృష్టించాడు కవి. సాధారణంగా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండే వెన్నెలకు మత్తును జోడించడం ద్వారా ఒక అసాధారణమైన, ఉల్లాసభరితమైన రూపాన్ని ఇచ్చాడు. నవ్వు ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. వెన్నెల నవ్వినప్పుడు చీకటి కూడా సిగ్గుపడి, చిన్నబోయిందని చెప్పడం అతిశయోక్తి (Hyperbole). ఇది వెన్నెల కాంతి ఎంత శక్తివంతంగా, అద్భుతంగా ఉందో తెలియజేస్తుంది. వెన్నెల కాంతి ముందు చీకటి శక్తిహీనమైందని, దాని ఉనికిని కోల్పోయిందని కవి గొప్పగా వర్ణించాడు. చీకటికి ఉండే భయం, అంధకారం వెన్నెల ప్రకాశం ముందు పటాపంచలైపోయాయని ధ్వనిస్తుంది. గౌడ వృత్తి నేపథ్యంలో చూసినప్పుడు, కల్లు అనేది సాధారణంగా మత్తును ఇచ్చే పానీయం. వెన్నెల స్వచ్ఛతకు ప్రతీక. ఈ రెండింటి కలయిక ఒక విచిత్రమైన, వినూత్నమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇది ఒక రకమైన విరుద్ధ అలంకారం (Irony) కూడా. కల్లు తాగినప్పటికీ, వెన్నెల మరింత ప్రకాశవంతంగా మారిందని చెప్పడం ఒక విచిత్రమైన అందాన్నిస్తుంది. ఇది కల్లు గీతకార్మికుల కష్టాల మధ్య కూడా ఆనందాన్ని వెతుక్కునే తత్వాన్ని పరోక్షంగా సూచిస్తుంది. కవిత చిన్నదైనా, దృశ్యపరంగా చాలా శక్తివంతమైనది. "కల్లు తాగిన వెన్నెల" అనే పదం వినగానే, మత్తుగా, ఉల్లాసంగా ఉన్న ఒక వెన్నెల ముఖం మన కళ్ళ ముందు మెరుస్తుంది. ఆ వెన్నెల నవ్వినప్పుడు చీకటి పలచబడిపోతున్న దృశ్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ స్పష్టమైన దృశ్యచిత్రణ (Imagery) గొప్ప కవిత్వ శిల్పానికి ప్రతీక. “వయసుకొచ్చిన ఇంద్రధనస్సు/వనంలోని పోత్తాడును చూసి/వయ్యారంగా సిగ్గుపడింది” అనే కవిత కూడా ఇలాంటిదే.

“లొట్టి మీద కాకి/లొట్టలేసుకుంటూ తాగి/లొడ లొడా వాగుతుంది” ఇక్కడ కాకి దేనికి ప్రతీకో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. “చీకటి చరిత్ర చిన్నబోయింది/అక్షరజ్యోతిని/వెలిగించింది తాటాకు” లాంటి కవితల్లోని కవిత్వ శిల్పం, బ్రివిటీ కవిత్వ గాఢతకు నిదర్శనం.  

‘ముస్తాదు’ కవితా సంపుటి కేవలం గౌడ వృత్తి జీవన చిత్రణకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ వృత్తిలోని శ్రమ, సంస్కృతి, ఆత్మగౌరవం, సవాళ్లను లోతుగా ఆవిష్కరించింది. "ముస్తాదు" ఒక సామాజిక డాక్యుమెంటరీగా, కళాత్మక సృష్టిగా నిలిచిపోతుంది. కవి తన అనుభవాలను, ఆ వృత్తిలోని ఆటుపోట్లను ఎంతో ఆర్ద్రంగా, శక్తివంతంగా ఆవిష్కరించిన తీరు, గౌడ వృత్తి పట్ల ఒక సరికొత్త అవగాహనను, గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఈ సంపుటి గౌడ వృత్తిలోని ప్రతి అణువును ఆవిష్కరించిన జీవన యాత్ర. ఇందులోని ప్రతి అక్షరం గౌడ వృత్తి పట్ల లోతైన అంతర్దృష్టిని కలిగిస్తుంది. ‘ముస్తాదు’ కవితా సంపుటి గౌడ వృత్తి జీవనశైలికి ఒక చారిత్రక రికార్డు. సామాజిక అధ్యయనాలకు కూడా ఒక విలువైన వనరు.

​-డాక్టర్ వెల్దండి శ్రీధర్

​9866977741.

O autoru

Writer, Poet, Artist

Ocenite ovu e-knjigu

Javite nam svoje mišljenje.

Informacije o čitanju

Pametni telefoni i tableti
Instalirajte aplikaciju Google Play knjige za Android i iPad/iPhone. Automatski se sinhronizuje sa nalogom i omogućava vam da čitate onlajn i oflajn gde god da se nalazite.
Laptopovi i računari
Možete da slušate audio-knjige kupljene na Google Play-u pomoću veb-pregledača na računaru.
E-čitači i drugi uređaji
Da biste čitali na uređajima koje koriste e-mastilo, kao što su Kobo e-čitači, treba da preuzmete fajl i prenesete ga na uređaj. Pratite detaljna uputstva iz centra za pomoć da biste preneli fajlove u podržane e-čitače.