ఇది వేదాంత గ్రంధముకాదు. కర్మ అనివార్యము అనిన గ్రంధము. ఒక్క భౌతికవాదులనేగాక వైరాగ్యలాలసులనుకూడ సరిదిద్ది, సమత్వభావమున వారి బుద్ధిని నిశ్చలముచేసి, వారికి కర్తవ్యపరాయణము విధి అని చూపిన ఏకైక గ్రంధము. గీతల స్వరూపనిర్ణయము, శ్రీ కృష్ణాపదేశము, వ్యాసభగవానుల రచనా సౌందర్యములను వివరించుచు పాఠకులకు ఆసాంతము విసుగుకలిగించని వినూత్న ప్రక్రియ.
నేటికి సుమారు మూడు వేల సం||లకు పూర్వము రచితములైన మూల గీతలు మీ హస్తకమలములందున్నవి. వీటిని ఒక పర్యాయము పఠించినవారు గీతాకారుని పోకడ వ్యవహారికము కాదను నిందను తిరిగి మోపరు. మరియు భారతీయ మస్తిష్కము యొక్క ప్రాముఖ్యముకూడ స్పష్టమగును.
దార్శనికుడు. మహాయోగి, సిద్ధపురుషుడు, ఉత్తర హిందూదేశమున వీరి మహిమలను గాంచినవారు వీరిని "భగవాన్" అని పిలిచిరి. కాన్పూరనందుండగా వీరి జీవితమేలనో గొప్ప మలుపు తిరిగెను. తమ సమస్త సిద్ధులను గంగార్పణము చేసి ఆంధ్ర దేశమున కేతెంచిరి. తిరిగి వీరెన్నడును తమ శేషజీవితమున మహామలను చూపలేదు. స్థితప్రజ్ఞునివలె జీవించుచు వామనుని బోలిన ఈ వ్యాసమును రచించిరి.